YSRCP: ఏపీ రాజకీయాలలో వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా అభ్యర్ధులని కూడా ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇప్పటికే స్థానం లేదని జగన్ పరోక్షంగా ఖరారు చేశారు. అయితే వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం ద్వారా సంతృప్తి పరచాలని జగన్ ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ దృష్టి ఉమ్మడి గోదావరి జిల్లాలపై పడినట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికలలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలలో మెజారిటీ సీట్లులో జనసేన పోటీ చేయాలని భావిస్తుంది.
టీడీపీ 35 నుంచి 40 వారలు జనసేన పార్టీకి ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆ `స్థానాలలో మెజారిటీ గోదావరి జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారు అని తెలుస్తుంది. గత ఎన్నికలలో కూడా జనసేనకి ఎక్కువ ఓట్లు నమోదు అయ్యింది ఉభయగోదావరి జిల్లాల నుంచే. ఈ నేపధ్యంలో ప్రస్తుతం తమ బలం మరింత పెరిగిందని భావిస్తున్న జనసేన అక్కడ పోటీచేయాలని భావిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం, తాడేపల్లిగూడెం, కాకినాడ రూరల్ నియోజకవర్గాలలో ఎక్కడో ఒక చోట పోటీ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో ఉభయగోదావరి జిల్లాలలో ఎమ్మెల్యే అభ్యర్ధులని వైసీపీ తరపున ఖరారు చేస్తున్నట్లు తెలుస్తుంది.
కాకినాడ రూరల్ నుంచి మరల కురసాల కన్నబాబుని ఎమ్మెల్యేగా బరిలో దింపుతున్నారు. అలాగే మచంద్రాపురం నుండి చెల్లుబోయిన వేణుకు మరొకసారి అవకాశం దక్కగా, పెద్దాపురం నుండి నియోజకవర్గ ఇన్చార్జ్ దవులూరి దొరబాబు పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఎంపీ మిథున్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. అలాగే గోదావరి జిల్లాల్లో బలమైన నాయకులుగా ఉన్న తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ కి కూడా ఎమ్మెల్యే టికెట్లు ఖరారు చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. పాలకొల్లు నియోజకవర్గం నుంచి మేకా శేషుబాబు. గుణ్ణం నాగబాబులలో ఒకరిని రామానాయుడి మీద పోటీ దింపే యోచనలో ఉన్నారని వినికిడి. కచ్చితంగా మెజారిటీ స్థానాలని గెలుచుకోవాలని, అలాగే జనసేనకి గండికొట్టే విధంగా బలమైన ఆర్ధిక మూలాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్ధులని ఖరారు చేయనున్నారని తెలుస్తుంది.