Ram Gopal Varma : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటే ఒంటికాలిపై లేచేవారు. కానీ ఈ మధ్య ఏమైందో ఏమో కానీ మెగా ఫ్యామిలీ జపం మొదలు పెట్టారు. మొన్నటికి మొన్న మెగాస్టార్ చిరంజీవికి, గరికపాటి నరసింహారావుకు మధ్య జరిగిన ఘటనపై స్పందిస్తూ గరికపాటిని ఏకి పారేశారు.ఒక్క ట్వీట్‌తో ఆపేయలేదు. ఒక్క రోజుతో ఆపేయలేదు. వరుస ట్వీట్స్.. రోజువారీగా గరికపాటిపై ఇష్టాను రీతిగా ట్వీట్స్. ఇక చివరికి ఎలాగో శాంతించారు. ఇప్పుడు అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రశంసల జల్లు కురిపించడం మొదలు పెట్టారు.
విశాఖ ఘటన తర్వాత జగన్ సర్కారుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేనంత రీతిలో విరుచుకు పడిన సంగతి తెలిసిందే. తనను ప్యాకేజీ స్టార్ అని ఎవరైనా అంటే చెప్పు తీసుకుని కొడతానంటూ చెప్పు చూపించి మరీ హెచ్చరికలు జారీ చేశారు.ఈ వ్యాఖ్యలు ఏపీ పెను దుమారాన్నే రేపాయి. రాజకీయంగా ఏపీలో చకచకా మార్పులు చోటు చేసుకున్నాయి. పవన్.. బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు మాట్లాడటం.. ఆ తరువాత కొన్ని గంటలకే టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం చకచకా జరిగిపోయాయి.
కాగా పవన్ కల్యాణ్ ఓ రేంజ్లో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడిన తీరును వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసించారు. గత వందేళ్లలో తాను విన్న అత్యంత ప్రభావవంతమైన, అద్భుతమైన స్పీచ్ పవన్ కళ్యాణ్‌ది అని ఆర్జీవీ పేర్కొన్నారు. వామ్మో.. ఆర్జీవీ పవన్‌ను ఈ రేంజ్లో పొగడటం కొత్తగా ఉంది కదా. అంతేనా? జనసేనాని చెప్పే ధర్మం మనవాళ్లలో కొందరికి అర్థం కాదని.. ఓ తీవ్రతతో గుండెల్లోకి చొచ్చుకుపోయేలా పవన్ కళ్యాణ్ మాటలు ఉన్నాయన్నారు. మంచి వాక్పటిమతో ఉన్న జనసేనాని స్పీచ్ ఎప్పుడూ జనాలను కదిలిస్తుందంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన పవన్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అసలు ఆర్జీవీ నిజంగానే పవన్‌ను పొగిడారా? లేదంటే లోగుట్టు వేరే ఉందా? అని చర్చించుకుంటున్నారు.