ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన హనుమాన్ టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న మొట్ట మొదటి ఇండియన్ సూపర్ హీరో మూవీగా హనుమాన్ తెరకెక్కుతుంది. వరల్డ్ ఫస్ట్ సూపర్ హీరోగా ఇండియన్స్ అందరూ విశ్వసించే హనుమంతుడికి ఈ మూవీలో తేజ సజ్జా కనిపిస్తున్నాడు. ఇక సోషల్ వరల్డ్ లో హనుమాన్ ఎ విధంగా సంబంధం కలిగి ఉన్నాడు. అలాగే తాను చేసే అద్బుతాలు ఏంటి అనేది ఈ మూవీలో ప్రశాంత్ వర్మ చూపించబోతున్నాడు. ఇక 12 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు. నిజానికి యంగ్ హీరో తేజ సజ్జాకి ఆ స్థాయిలో మార్కెట్ లేదు. కాని సూపర్ నేచురల్ కంటెంట్ కి పాన్ ఇండియా లెవల్ లో మంచి మార్కెట్ ఉంది. ఈ నేపధ్యంలో హనుమాన్ మీద భారీగా ఖర్చు పెట్టారు. ఇక టీజర్ లో మూవీ ఖర్చు మొత్తం కనిపిస్తుంది.
విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు హనుమాన్ టీజర్ తో ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ కి పోలిక పెడుతూ దర్శకుడు ఓం రౌత్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఏకంగా 500 కోట్లు ఖర్చు పెట్టిన ఆదిపురుష్ టీజర్ హనుమాన్ టీజర్ లో పదో వంతు కూడా లేదని విమర్శిస్తున్నారు. సౌత్ దర్శకులని చూసి సినిమా తీయడం నేర్చుకోవాలంటూ నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. ఆదిపురుష్ లో హనుమాన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ అస్సలు కరెక్ట్ గా లేదు. అతన్ని వారియర్ గా చూపించే ప్రయత్నం ఓం రౌత్ చేశాడు. అయితే హనుమాన్ సినిమాలో ఆంజనేయుడిని ఓ వైపు వారియర్ గా చూపిస్తూనే అతనికి ఆ శక్తికి కారణం రాముడి మీద అచంచలమైన భక్తి అని రిప్రజెంట్ చేసే విధంగా టీజర్ లో విజువల్స్ వేశారు. ఆదిపురుష్ లో హనుమాన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ అలాంటిది కనిపించలేదు.
అలాగే విజువల్స్ పరంగా కూడా హనుమాన్ టీజర్ లో చాలా నేచురల్ గా దృశ్యాలు ఉన్నాయి. అదే ఆదిపురుష్ టీజర్ లో ఏ దృశ్యం కూడా నేచురాలిటీకి దగ్గరగా లేదు. ఏదో యానిమేషన్ కార్టూన్ క్యారెక్టర్స్ చూసిన ఫీలింగ్ అందరికి కలిగింది. ఇదే ఇప్పుడు ఆదిపురుష్ ని మరోసారి ట్రోల్ చేయడానికి కారణం అయ్యింది. ప్రస్తుతం సినిమాల విషయంలో ఇండియన్స్ అందరూ మైథాలజీలోని సారాంశాన్ని భక్తి జోడించి చెబితే చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలా కాకుండా నేలవిడిచి సాము చేస్తే మాత్రం తలబొప్పి కట్టేలా ఫలితం ఇస్తున్నారు. దీనికి బ్రహ్మాస్త్ర సినిమా కూడా ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆ మూవీలో అస్త్రాల శక్తిని చూపించే క్రమంలో ఎక్కడా కూడా దైవశక్తి గొప్పతాన్ని రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేయలేదు. ఈ నేపధ్యంలో హనుమాన్ మూవీ టీజర్ ని బాలీవుడ్ దర్శకులు అందరూ ఒకసారి చూడాలంటూ ట్విట్టర్ లో సెటైర్స్ వేస్తున్నారు.