తెలంగాణ సీఎంగా సీతక్క
మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. మరోసారి విజయాన్ని సొంతం చేసుకోవాలనే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉంది. ఈ సారి ఎన్నికల్లో అయినా అధికారంలోకి వచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్. రానున్న ఎన్నికల్లో టీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు? ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఎవరికి సీఎంగా అవకాశం వస్తుంది? అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.
అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో పాల్గొన్నా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవసరమైతే ములుగు ఎమ్మెల్యే సితక్కను సీఎంగా చేస్తామని తెలిపారు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని చేపడితే దళితులు, గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కొంతమంది ఎన్నారైలు రేవంత్‌ను కోరగా, సితక్కకు సీఎం పదవి గురించి వ్యాఖ్యానించారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం
రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం నేతలందరం కలిసి పనిచేస్తామని, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలను అమలు చేస్తామని రేవంత్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఎన్నారైలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ కోసం తాను నిత్యం శ్రమిస్తూనే ఉంటానన్నారు. ఈ క్రమంలోనే దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. .
తెలంగాణ రాజకీయాల్లో సితక్కకు మంచి ఎమ్మెల్యేగా పేరుంది. అన్ని పార్టీల నేతలు ఆమెను గౌరవిస్తారు. బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలలోనూ ఆమెకు అభిమానులున్నారు. నిరంతరం ప్రజల్లో తిరుగుతూ, ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ సితక్క మంచి రాజకీయ నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డితో సీతక్కకు మంచి అనుబంధం ఉంది. రేవంత్‌రెడ్డి సీతక్క తనకి సొంత చెల్లి లాంటిదని అనేకమార్లు రేవంత్ పలికారు. అలాగే రేవంత్‌ను కూడా తాను సొంత అన్నలా భావిస్తానని సితక్క చెప్పుకొచ్చారు.
గతంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కకు కీలక పదవి ఇస్తామని రేవంత్ అన్నారు . అంతేకాకుండా జాతీయ స్థాయి కాంగ్రెస్‌లో సితక్క కీలక పోస్టులో ఉన్నారు. ఇలాంటి తరుణంలో సీతక్కను సీఎం అభ్యర్థిగా రేవంత్ ఫోకస్ చేయడం వెనుక వ్యూహం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రజల్లోసీతక్కకు ఉన్న ఫాలోయింగ్ ను వినియోగించుకునేందుకు మాత్రామే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ కూడా బలంగా ఉంది.