Shivaji: ఏపీ రాజకీయాలలో తృతీయ ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దశాబ్ద కాలం నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్న కూడా తనని తాను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా చెప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. రాజకీయాలలో మార్పు తీసుకొస్తా అంటున్నారు తప్ప, ఆయన ఆశించే మార్పు ఎక్కడా కనిపించడం లేదు. అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత యువత ఎక్కువగా రాజకీయాలలో భాగస్వామ్యం అవుతున్నారు. జనసేనతో కలిసి పనిచేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కొత్తతరం నాయకులని తయారు చేసే పనిలో జనసేనాని ఉన్నారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తన స్థాయి ఏంటో తెలుసుకోలేకపోతున్నారు అని, ఆయనొక శక్తి, అని, కరెక్ట్ గా తలుచుకుంటే ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే స్థిరమైన విధానం, బలమైన రాజకీయ కార్యాచరణ లేకపోవడం జనసేనానికి ఉన్న మైనస్ అని కూడా అంటున్నారు. తాజాగా హీరో శివాజీ కూడా పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఓ ఇంటర్వ్యూలో చేశారు. పవన్ ఒక వ్యక్తి కాదు. ఒక శక్తి. ఆయన పిలిస్తే పార్టీలతో సంబంధం లేకుండా రోడ్ల మీదకు వచ్చి ఆయనకు మద్దతు తెలిపే వాళ్లు చాలా మంది ఉన్నారు. జనసేనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఆ పార్టీకి మద్దతు తగ్గడం, పెరగడం అంటూ ఏమీ లేదు. వాళ్ల ఓట్ బేస్ వాళ్లకు ఉంది.
పంచాయితీ ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో వారి ఉనికి చాటుకున్నారు. ఆయన తల్చుకుంటే కచ్చితంగా సీఎం అవ్వగలరు. ఆయన తల్చుకుంటే ప్రత్యేక హోదా అవుతుంది. అమరావతి అక్కడే ఉంటుంది. విశాఖ ఉక్కు నిలబడుతుంది. కాని ఆయన తలుచుకోరు. అదే ఎవరికి అర్ధం కాని ప్రశ్నగా ఉంది. అతని మాటకి చాలా బలం ఉంటుంది. అయితే స్థిరమైన విధానాలు లేకపోవడం, పార్టీల మీద ఆధారపడి రాజకీయం చేయడం జనసేనానిలో కనిపిస్తుంది. జగన్ లో ఉన్న బలమైన కాంక్ష పవన్ కళ్యాణ్ లో లేదు అని శివాజీ వ్యాఖ్యానించారు. నాకు జనసేన పార్టీలో చేరాలని.. ఆయనతో ఉండాలి అనేం లేదు. మన దగ్గర అస్త్రం ఉంటే దానిని సరిగ్గా వాడుకోవాలి అనేది నా తాపత్రయం అంటూ శివాజీ వ్యాఖ్యానించారు.