Amaravathi: ఏపీలో రాజధాని రాజకీయం అనేది ఏ రేంజ్ లో నడుస్తుందో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి వ్యూహాత్మకంగా విశాఖని కార్యనిర్వాహ రాజధానిగా మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అని చెబుతున్నారు. విశాఖలో ముఖ్యమంత్రి నివాసం కోసం స్థలం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ భవంతులలో ఏదో ఒక దానిని ముఖ్యమంత్రి కోసం కేటాయించడం కోసం సిద్ధం అవుతున్నారు. మరో వైపు రుషికొండపై ముఖ్యమంత్రి కార్యాలయం కట్టడానికి పనులు చకచకా జరిగిపోతున్నాయి.

ఋషికొండని ద్వంసం చేయడంపై ఎంత వ్యతిరేకత వస్తున్నా కూడా వైసీపీ సర్కార్ మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే ఉగాది నుంచి విశాఖ నుంచి పరిపాలన మొదలు పెట్టబోతున్నట్లుగా ఇప్పటికే వైసీపీ మంత్రులు అందరూ చెప్పేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని విషయంలో ఊహించని విధంగా వైసీపీ సర్కార్ కి షాక్ ఇచ్చింది. విభజన హామీల్లో భాగంగా రాజధాని ప్రాంతం గుర్తించడం కోసం కేంద్రం వేసిన కమిటీ అప్పటి ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని తెలిపారు.
దీనిప్రకారం టీడీపీ ప్రభుత్వం 2015లో అమరావతి రాజధానిగా నోటిఫై చేయడం జరిగిందని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో పేర్కొన్నారు. దానిప్రకారం కేంద్రం ఇప్పటికి ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న వైసీపీ సర్కార్ తమకి రాజధాని మార్పుపై ఇప్పటి వరకు చెప్పలేదని పేర్కొన్నారు. అయితే రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానిదే నిర్ణయం అని వాదిస్తూ వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇది 23న విచారణకి రానున్నట్లు తెలుస్తుంది. అయితే రాజధాని విషయంలో వైసీపీ సర్కార్ కి బీజేపీ ప్రభుత్వం కచ్చితంగా ఝులక్ ఇచ్చే అవకాశం ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.