Earthquake : టర్కీ , సిరియాలో భారీ భూకంపం సంభవించింది. 7.8 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కావడంతో ఇళ్లన్నీ ఒక్కసారిగా నేలమట్టమై పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. తెల్లవారుజాము కావడం ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో అసలేం జరుగుతుందే తెలియ పరిస్థితిలో చాలా మంది మృత్యువు ఒడికి చేరుకున్నారు. సైప్రస్ ద్వీపం వరకు ప్రకంపనలు ప్రభావం చూపాయి. టర్కీలోని స్థానిక అధికారులు మరణాల సంఖ్యను గా పూర్తిగా వెల్లడించలేదు. అయితే దాదాపు 100కుపైగా ప్రజలు ఇప్పటి వరకు మరణించి ఉంటారని తెలుస్తోంది. శిథిలాలను తీసేకొద్దీ మృతుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. ఉత్తర సిరియాలోని ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో 42 మంది మరణించారని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 04:17 గంటలకు 17.9 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని, 15 నిమిషాల తర్వాత 6.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని యుఎస్ ఏజెన్సీ తెలిపింది. టర్కీ అత్యవసర సేవా కేంద్రం మొదటి భూకంప తీవ్రతను 7.4 గా పేర్కొంది.ఈ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపంగా దానిని పరిగణిస్తున్నారు.

భూకంపం వల్ల నష్టపోయిన పౌరులందరికీ నా ప్రగాఢసానుభూతిని తెలియజేస్తున్నాను అని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ట్వీట్ చేశారు. వీలైనంత త్వరగా ఈ విపత్తును అధిగమించగలమని మేము ఆశిస్తున్నాము అని పేర్కొన్నారు. భూకంపం దక్షిణ టర్కీ మరియు పొరుగున ఉన్న సిరియాలోని ప్రధాన నగరాల్లో డజన్ల కొద్దీ భవనాలను నేలమట్టం చేసింది, ఈ దేశంలోని వందల మందిని చంపింది మిలియన్ల మంది ప్రజలను నిర్వాసితులను చేసిందన్నారు.