Hyderabad : మొదటి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నాలుగు రోజుల తర్వాత ఆదివారం రాత్రి మృతి చెందింది. ఐసీయూ లో నాలుగు రోజుల నుంచి వెంట్రిలేటర్ పైనే ఉన్న ప్రీతి రాత్రి 9 .30 నిమిషాలకు కన్ను మూసింది. కాకతీయ మెడికల్ కాలేజీలో తన సీనియర్ వేధింపుల కారణంగా 26 ఏళ్ల ప్రీతి బుధవారం ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రిలో రాత్రి షిఫ్టులో పని చేయడంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమె పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు.

ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు, వేధింపుల ఆరోపణలపై రెండో సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి మహమ్మద్ అలీ సైఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి, నిందితుల ఫోన్లలో వాట్సాప్ చాటింగ్‌లు ర్యాగింగ్‌ను సూచించాయని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.

జాతీయ మానవ హక్కుల కమిషన్ , ఎస్సీ , ఎస్టీ జాతీయ కమీషన్ ప్రభుత్వం, ఎంజిఎం హాస్పిటల్ సూపరింటెండెంట్, ప్రీతి విద్యార్థిగా ఉన్న అనస్థీషియాలజీ ప్రిన్సిపాల్ కు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రీతి మృతి పై సీఎం కేసీఆర్ సహా మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ , నిరంజన్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.
తాజాగా ప్రీతి మృతి పై తండ్రి మీడియా తో మాట్లాడారు. నా బిడ్డది ఆత్మహత్య కాదని హత్యే నని ఆరోపించారు. సీనియర్ విద్యార్థిపై కళాశాల, ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ప్రీతి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి మృతికి కారణం ఇంజక్షన్ అని తెలిపారు. ఎవరో ప్రీతికి ఇంజక్షన్ ఇచ్చారు అని అన్నారు. కాకతీయ మెడికల్ కాలేజీ అనస్థీషియా డిపార్ట్మెంట్ హెడ్ ను వెంటనే సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేశారు. ప్రీతి మృతికి సంబంధించిన నిజ నిజాలు బయట పడే విధంగా పోలీసులు దర్యాప్తు చేయాలన్నారు.