Kanna Lakshminarayana: ఏపీలో బీజేపీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ బీజేపీ పార్టీని వీడారు. ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. తాజాగా గుంటూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని అధికారికంగా దృవీకరించారు. గత కొంత కాలంగా బీజేపీలో సోము వీర్రాజుకి కన్నా లక్ష్మినారాయణ దూరంగా ఉంటున్నారు. పరోక్షంగా సోముపైన విమర్శలు చేస్తున్నారు. జనసేన రోడ్ మ్యాప్ విషయంలో కూడా బీజేపీ నుంచి సోము వీర్రాజు స్పందన సరిగా లేదని విమర్శలు చేశారు. అలాగే రాజ్యసభ ఎంపీ జీవీఎల్ మీద కూడా విమర్శలు గుప్పించారు.

ఈ నేపధ్యంలో కన్నా లక్ష్మినారాయణ జనసేన పార్టీలో చేరబోతున్నారు అనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ప్రస్తుతానికి బీజేపీ పార్టీ నుంచి మాత్రం కన్నా బయటకి వచ్చేశారు. వారం రోజుల్లో కార్యకర్తలతో సమావేశం అయ్యి వారి అభీష్టం మేరకు ఏ పార్టీలో చేరేది నిర్ణయం తీసుకుంటామని కన్నా లక్ష్మినారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు నిర్ణయాలపైన కూడా ఆయన సీరియస్ అయ్యారు. సోము వీర్రాజు కారణంగానే తాను బీజేపీ పార్టీ వీడుతున్నట్లు పేర్కొన్నారు.
పార్టీకి నష్టం కలిగించే విధంగా అతని విధానాలు ఉంటున్నాయని పేర్కొన్నారు. అలాగే కేంద్రంతో సంబంధం లేకుండా సొంత ఎజెండాతో సోము వీర్రాజు ఏపీలో బీజేపీ పార్టీని నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ పార్టీలో ఇక కొనసాగలేక బయటకి వచ్చినట్లు తెలిపారు. ఇక త్వరలో ఏ పార్టీలో చేరేది తెలియజేస్తా అని చెప్పారు. ఇదిలా ఉంటే కన్నా లక్ష్మినారాయణ టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఇప్పుడు వినిపిస్తుంది. మరి అందులో వాస్తవం ఎంత అనేది చూడాలి.