Karnataka : కామవాంఛ తీర్చుకోవాలన్న కోరికతో కన్నూమిన్నూ కానకుండా కూతురన్న ఇంగితం కూడా లేకుండా అనేక దారుణాలకు మానవ మృగాలు పాల్పడుతున్నాయి. రెండో భార్య కూతురు తనకు కూతురవుతుందని తండ్రి స్థానంలో ఉన్నానన్న కనికరం కూడా లేకుండా లేత మొగ్గను తుంచేసిన ఘనట కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో చోటుచేసుకుంది. పని నిమిత్తం భార్య ఊరికి వెళ్లిన సమయంలో సవతి కూతురిపై దారుణానికి ఒడిగట్టాడో ప్రభుద్దుడు. ఇది జరిగి రేండేళ్ల అనంతరం తాజాగా కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది.

ఉడిపిలోని పోక్సో కేసులను విచారిస్తున్న జిల్లా అదనపు మరియు సెషన్స్ కోర్టు తన మైనర్ అయిన సవతి కుమార్తెను లైంగికంగా వేధించిన కేసులో 49 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు విధించింది. లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన నిందితుడు గణేష్ నాయక్.
ఛార్జ్ షీట్ ప్రకారం, నాయక్ బాధితురాలి తల్లిని రెండవ వివాహం చేసుకున్నాడు. వారితోనే కలిసి నివసిస్తున్నాడు. నాయక్ రెండో భార్యకు ఓ కూతురు ఉంది. భార్య పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె కూతురు ఇంట్లోనే ఉండేది. నాయక్ 2021 అక్టోబర్‌లో మైనర్ అయిన ఆ బాలికకు మద్యం కలిపిన జ్యూస్ తాగించి, లైంగికంగా వేధించాడు. మూడు నెలల తర్వాత తల్లి తిరిగి వచ్చేసరికి కూతురు గర్భవతి అని తెలిసింది. బాధితురాలు తన బాధను వివరించడంతో, జనవరి 2022లో ఉడిపిలోని కుందాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కంప్లైంట్‌ను స్వీకరించిన అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కేఆర్ గోపీకృష్ణ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. విచారణలో మొత్తం 10 మంది సాక్షులను విచారించారు. జీవిత ఖైదుతో పాటు, న్యాయమూర్తి శ్రీనివాస సువర్ణ దోషికి 10వేల రూపాయల జరిమానా విధించారు, లేని పక్షంలో అతను అదనంగా ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైటీ రాఘవేంద్ర హాజరయ్యారు.