KCR: బీఆర్ఎస్ పార్టీతో ఏపీలో కూడా రాజకీయాలు మొదలు పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా మరింతగా ముందుకి అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఏపీ పార్టీ అధ్యక్షుడిని నియమించిన కేసీఆర్ ఇప్పుడు మరికొంత మంది కీలక నాయకులకి గాలం వేస్తున్నారు. ఏపీలో క్రియాశీలకంగా ఉన్న నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీలో పని చేసి ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న వారిని పార్టీలోకి ఆహ్వానించే పని పెట్టుకున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఈ బాధ్యతని బీఆర్ఎస్ లీడర్ వివేక్ కి అప్పగించినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలోనే తాజాగా ఆయన విశాఖలోని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో భేటీ అయ్యి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది.
అలాగే మరికొంత మంది కీలక నేతలతో కూడా వివేక్ భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. రాజమండ్రికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్ష కుమార్ ని కూడా వివేక్ భేటీ కాబోతున్నారని టాక్ వినిపిస్తుంది. అతనిని పార్టీలోకి ఇన్వైట్ చేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే టీడీపీ పార్టీకి చెందిన కాపు నాయకులని కేసీఆర్ టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. వారికి భవిష్యత్తు ఆశ చూపించి బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా కేవలం వైసీపీకి లబ్ది చేకూర్చడానికి జగన్ తో కలిసి కేసీఆర్ చేయిస్తున్నాడు అనే టాక్ రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

టీడీపీని బలహీనపరచడం ద్వారా జగన్ గెలుపుని ఈజీ చేయాలని కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే చంద్రబాబు ఆ అవకాశం కేసీఆర్ కి ఇవ్వకపోవచ్చని, కేసీఆర్ రాజకీయ వ్యూహాలు కరెక్ట్ గా తెలిసిన చంద్రబాబు తనని ఎక్కడ కంట్రోల్ చేయాలో అక్కడ చేస్తాడని తెలుగుదేశం అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు మొదలై రచ్చకెక్కిన టైంలోనే కేసీఆర్ వ్యూహాత్మకంగా ఏపీలో ఫోకస్ చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.