వీఆర్ఎస్ ఇవ్వనందుకు మురారి మీద కోపంగా ఉంటుంది కృష్ణ. ఆ తర్వాత మురారి తమ ఊరికి చంద్రశేఖర్, కృష్ణలను కూడా తీసుకెళ్తాడు. అక్కడ కాఫీ షాపులో కూడా కృష్ణ మురారి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఆ తర్వాత నవంబర్ 28 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం..
వీఆర్ఎస్ ఇవ్వడం అబద్ధం అని తెలియడంతో మురారి మీద అలిగి కోపంతో వెళ్లిపోతుంది కృష్ణ. నా కూతురు ఎక్కడా అని చంద్రశేఖర్ వచ్చి అడగ్గా.. మీ కూతురు నా మీద అలిగి వెళ్లిపోయింది గురువుగారు. అందుకే తనకు వీఆర్ఎస్ గురించి చెప్పేయండి గురువుగారు అంటాడు మురారి. సరే అలిగిన మా అమ్మాయిని బుజ్జగించి తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది మీరు వెళ్లండి సార్ అని మురారిని పంపిస్తాడు సీఐ. మా అమ్మాయిని తీసుకుని నేను బస్సుకు వస్తానంటూ మాటిస్తాడు చంద్రశేఖర్.
సీన్ కట్ చేస్తే.. ముకుందని పెళ్లి కూతురు చేస్తారు. తను మాత్రం శ్రీకృష్ణ అంటే మురారి గురించి ఆలోచిస్తూ దిగులుగా ఉంటుంది. ఆ తర్వాత భవాని వచ్చి మన కుటుంబ ఆచారం ప్రకారం పెళ్లికూతురికి సారె పెట్టమని రేవతికి చెప్తుంది. అక్క చెప్పినట్లుగానే చేస్తుంది రేవతి. పెళ్లి కూతురు ఫేస్ డల్‌గా ఉందంటూ భవాని కోడలు అనుమానం వ్యక్తం చేస్తుంది. పెళ్లంటే సిగ్గుగా ఉంటుంది కదా అని ముకుంద తల్లి చెప్పగా.. కారణం ఇంకా ఏదో అయి ఉంటుందని అంటుంది అవంతిక. భవాని అవంతికకు చివాట్లు పెడుతుంది. కానీ అవంతిక ఏ మాత్రం వినకుండా అమ్మాయి బాధకు కారణం ఏంటో కనుక్కోమంటుంది. దాంతో భవాని కూడా ముకుంద తల్లిదండ్రులను నిలదీస్తుంది. మీ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టమేనా అంటూ ప్రశ్నిస్తుంది. ఏం ముకుంద ఈ పెళ్లి నీకిష్టమేనా? అని అడుగుతుంది భవాని. ఈ పెళ్లి విషయంలో నా అభిప్రాయం చెప్తాను అంటూ లేచి నిలబడుతుంది ముకుంద.
నా మనసులో ఎలాంటి ప్రాబ్లం లేదు. మా అమ్మనాన్నల ఫోర్స్ అంతకన్నా లేదు అంటుంది ముకుంద. మరి ఎందుకు డల్‌గా ఉన్నావని అడుగుతుంది భవాని. నువ్ నీ పుట్టింటి నుంచి మరో పుట్టింటికి వెళ్తున్నావ్. ఈ క్షణం నుంచే నీ మనసులో భయం తీసేయ్ అంటుంది. గొప్ప కుటుంబంలోకి కోడలుగా రావడం నీ అదృష్టం. నువ్ కూడా మా కుటుంబ పరువు, మర్యాదల్ని నిలబెట్టాలని హితబోధ చేస్తుంది భవాని కాబోయే కోడలికి. చూడమ్మా మనిషిని నడిపించేది నమ్మకం అంటూ మురారి తల్లి ముకుందకు ధైర్యాన్ని చెబుతుంది. నమ్మకంతో అడుగుపెట్టు జీవితం అందంగా ఉంటుందని చెప్తుంది. ఎవరి కోసమో కళ్లల్లో ఎదురుచూపులు కనిపిస్తున్నాయని పసిగడుతుంది.
మురారి ఫోన్ ట్రై చేస్తూనే ఉంటాడు. ముకుంద మురారి వస్తాడన్న ఆశతో ఎదురుచూస్తుంది. మన ప్రేమ ఇలా మనసుల్ని కాలుస్తుందని అనుకోలేదు అనుకుంటూ బాధపడుతుంది. ముకుంద కాల్ చేస్తుందేమోనని ఎదురుచూస్తాడు మురారి కూడా. ఈ పెళ్లిలో మన ప్రేమ గురించి మా ఇంట్లో వాళ్లకి చెప్పి నిన్ను పరిచయం చేద్దామనుకున్నా. ఆలోపు నువ్ దొరుకుతావని ఒక చిన్న ఆశ అని ఫోన్ ట్రై చేస్తాడు మురారి. అలా ఇద్దరూ ఒకరినొకరు తలుచుకుంటూ ఎమోషనల్ అవుతారు. అతడి ప్రేమని మరిచిపో అని ముకుందకు తన ఫ్రెండ్ సూచిస్తుంది. మరిచిపోలేకపోతున్నానే అంటూ బాధపడుతుంది ముకుంద. అపుడే తన పేరెంట్స్ కూడా వచ్చి కూతుర్ని ఓదారుస్తారు. నీ జీవితం బాగుంటుందని నచ్చచెప్తారు. మా నిర్ణయాన్ని గౌరవించి.. తలదించుకొని తాళి కట్టించుకోమని చెప్తాడు ముకంద తండ్రి. దాంతో వెక్కి వెక్కి ఏడుస్తుంది ముకుంద.
ఈ క్షణం కూడా నా మనసు బలంగా చెప్తుంది. అతడు వస్తానని నాకు నమ్మకం ఉందంటుంది ముకుంద. నెంబర్ అన్‌బ్లాక్ చేసి మళ్లీ ఫోన్ ట్రై చేస్తుంది. కానీ కాల్ కలవదు. దాంతో ముకుంద అప్సెట్ అవుతుంది. కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆ తర్వాత సీన్లో చంద్రశేఖర్, కృష్ణలు పెళ్లికి వెళ్లకుండా ఇంటికి వెళ్లిపోతారు. దాంతో కూతురి మీద కాస్త కోపంతో ఉంటాడు సీఐ. ఇక్కడే ఉంటూ ఏ క్షణం ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది నాన్నా. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి నాన్నా అంటూ వేడుకుంటుంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఇపుడే వెళ్లి రిజైన్ చేయండని చెప్తుంది కృష్ణ. ఒక్కసారి నేను చెప్పేది విను అని చంద్రశేఖర్ ఎంత బతిలాడినా కూతురు వినదు. నన్ను బాధపెట్టకు అనుకుంటూ వెళ్లిపోతాడు చంద్రశేఖర్. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.