నిన్నటి ఎపిసోడ్లో మురారి ఆదర్శ్ పెళ్లికి అటెండ్ అవుతాడు. తనకు కాబోయే భార్యని చూసి ఎలా ఉందో చెప్పమని ఆదర్శ్ బలవంతం చేస్తాడు. కానీ మురారిని చూడకుండా అడ్డుకుంటుంది రేవితి. అక్కడు ముకుంద మురారి గొంతు విని ఇల్లంతా వెతుకుతుంది. కానీ మురారి కనిపించడు. ఆ తర్వాత నవంబర్ 30 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం..
మురారి చేత పెళ్లికూతురికి నగలు పంపిస్తుంది భవాని. ఒక ముఖ్యమైన విషయం.. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ కుటుంబం పరువు పోకూడదని చెప్పేవారు మీ పెద్దనాన్న. దాన్ని మనమే కాపాడాలిరా అంటుంది భవాని మురారితో. అలాగే పెద్దమ్మ అంటూ మాటిస్తాడు మురారి. మన కుటుంబ గౌరవం తగ్గకుండా కాపాడాల్సిన బాధ్యత నీదే. మనింట్లో గౌరవంగా జరుగుతున్న మొదటి పెళ్లి ఇది. ఎలాంటి లోటు రాకుండా నువ్ చూసుకుంటావన్న నమ్మకం నాకుంది అని అంటుంది భవాని. అమ్మాయిని చూసి ఎలా ఉందో చెప్పమంటాడు ఆదర్శ్.
ముకుంద తల్లిదండ్రులకు మురారిని పరిచయం చేస్తాడు గోపి. ఒక్క నిమిషం బాబు అంటూ ముకుందని పిలుస్తుంది. మెట్ల మీది నుంచి కిందికి వస్తున్న ముకుందని చూసి కంగుతింటాడు మురారి. కానీ ముకుందకు మాత్రం మురారిని చూడగానే ప్రాణం తిరిగి వచ్చినట్లవుతుంది. తనతో కలిసి ఉన్న గతాన్ని గుర్తు చేసుకుంటుంది. తను ఆదర్శ్ వాళ్ల బ్రదర్ అంటూ ముకుందకు పరిచయం చేస్తారు. నీకు నగలు ఇవ్వమని పంపించారని చెప్తుంది ముకుంద తల్లి. ముకుంద, మురారిలు ఒకరినొకరు అలాగే చూసుకుంటూ నిల్చుండిపోతారు. మనసులో బాధతోనే ముకుందకు నగలు అందజేస్తాడు. అవి తీసుకుని కోపంగా వెళ్లిపోతుంది ముకుంద.
సీన్ కట్ చేస్తే.. కృష్ణకు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. మీ నాన్న డ్యూటీకి వెళ్లారా లేక పర్మినెంట్‌గా పైకి వెళ్లారా అంటుంది తను. చంపేస్తా మా నాన్న గురించి మాట్లాడితే అంటూ అరుస్తుంది కృష్ణ. వీడియోలో మీ నాన్న ఉన్నాడు. రైల్వే ట్రాక్ దగ్గర శవం పడి ఉందంటూ చెప్తుంది. అది చూసి కుప్పకూలిపోతుంది కృష్ణ.
ఆ తర్వాత ముకుంద గదిలోకి వచ్చి బాధపడుతుంది. అపుడే మురారి వచ్చి రాధా.. అని పిలుస్తాడు. ‘నాకంతా షాకింగ్‌గా ఉంది. నిన్నిక్కడ ఇలా చూస్తానని కలలో కూడా అనుకోలేదు’ అంటాడు మురారి. నువ్ నాకోసం ఇలా వస్తావని కలలో కూడా ఊహించలేదంటుంది బదులిస్తుంది ముకుంద. విధి మనల్ని వెంటాడి వెంటాడి ఇలా చేస్తుందనుకోలేదు అంటాడు మురారి. ఈ పరిస్థితికి కారణం నువ్వే.. నాకోసం నువ్వు వస్తావని ఎదురుచూశా అంటుంది ముకుంద. మురారి కూడా తన పరిస్థితిని చెప్తాడు. కానీ తను నమ్మదు. నువ్ చెప్పేదంతా అబద్ధం. నువ్ అబద్ధం. నువ్ చేసిన మోసాల గురించి మాట్లాడుతున్నా. మగాళ్లందరూ స్వార్థపరులు. నిన్ను చూసి నా అభిప్రాయం మార్చుకున్నా.. అంటూ ఎమోషనల్ అవుతుంది ముకుంద. నువ్ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావ్.. అంటూ తన కలల్ని ప్రేయసికి చెప్తాడు మురారి. అలా ఇద్దరూ తమ తమ అభిప్రాయాల్ని చెప్పుకుంటారు. నిజమైన ప్రేమంటే ఎంతకాలమైనా ఎదురుచూడాలి కానీ ఇలా పదిరోజుల్లేనే పెళ్లి పీటలు ఎక్కేదానివి కాదంటాడు మురారి. నువ్ ఒక్క ఫోన్ చేసి ఉంటే జీవిత కాలమంతా ఎదురుచూసేదాన్ని అంటుంది ముకుంద. దాంతో మురారి తన మాటల్ని గుర్తుచేసుకుని బాధపడతాడు.
రాధా ఆ రోజు నేను కోపంగా మాట్లాడింది నీతోనా.. అంటాడు మురారి. అంటే నా ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోలేదా. నీ ప్రేమేంటో అర్థం అవుతుందని అంటుంది ముకుంద. నువ్ ఇచ్చిన లెటర్ లోయలో పడింది. క్రిమినల్‌కు సంబంధించిన ఫోన్ కాల్స్ వస్తుంటే అదే అనుకున్నా. గోపీ ద్వారా నీ నెంబర్ సంపాదించి రోజుకు వందసార్లు ఫోన్ చేశా అని ఫ్రూఫ్ చేస్తాడు మురారి. కాల్ లిస్ట్ చూసి ముకుంద నోట మాట రాదు. నిన్ను ఈ పెళ్లికి పిలిచి మా వాళ్లందరికి పరిచయం చేద్దామనుకున్నా అంటూ తన ఆలోచనల్ని చెప్తాడు మురారి. మరి ముకుంద ఏం చేయబోతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం..