దేవతలలో శ్రీకృష్ణుడు అంటే ఒక ప్రత్యేకమైన ఆహార్యం కనిపిస్తుంది. అంతకు మించి చలాకీతనం, చిలిపితనం, కొంటెతనం ఉండే పాత్ర ఔచిత్యం కనిపిస్తుంది. మొదటి నుంచి మన సినిమాలలో శ్రీకృష్ణుడు అంటే అదే విధంగా పాత్రలని రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. ఇండియన్ వైడ్ గా వచ్చిన సినిమాలు, సీరియల్స్ లలో కూడా కృష్ణుడి పాత్రని ఎప్పుడు సీరియస్ గా చూపించే ప్రయత్నం అయితే దర్శకులు చేయలేదు. అలాగే రచయితలు కూడా చేయలేదు. వ్యాసుడు రాసిన భాగవతం, భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడి పాత్ర చిత్రన చాలా కొత్తగా ఉంటుంది. మానవ జీవితాన్ని సంపూర్ణంగా, సంతోషంగా ఆశ్వాదించిన వ్యక్తిత్వం కనిపిస్తుంది. కష్టంలో కూడా సంతోషాన్ని వెతుక్కునే తత్త్వం కనిపిస్తుంది. యుద్ధాన్ని కూడా ఒక వినోద క్రీడగా భావించే తత్త్వం కనిపిస్తుంది. అందుకే శ్రీకృష్ణుడి పాత్ర ప్రతి ఒక్కరి హృదయాలకి దగ్గరగా ఉంటుంది.
కృష్ణుడిని ఒక దేవుడిగా ఆరాధించే వారికంటే ఒక స్నేహితుడు అని భావించే వారు ఎక్కువ. కృష్ణ భక్తులు సైతం శ్రీకృష్ణ భగవానుడిని అలాంటి దృక్కోణం నుంచే చూస్తారు. సమస్తం తానే విస్తరించి ఉన్నాడని నమ్ముతారు. అలాంటి కృష్ణతత్వాన్ని రిప్రజెంట్ చేసే సినిమాలు మన టాలీవుడ్ లో చాలా తక్కువ వచ్చాయని చెప్పాలి. పౌరాణిక కథలు పక్కన పెడితే కృష్ణతత్వంతో ముడిపడి శ్రీకృష్ణుడి పాత్రలతో వచ్చిన సాంఘిక చిత్రాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తాయి. రాజేంద్ర ప్రసాద్ కన్నయ్య కిట్టయ్య సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి మంచి హిట్ అయ్యింది.
అలాగే ఏఎన్నార్ కూడా ఓ సినిమాలో కృష్ణుడి తరహా పాత్రలో కనిపించి మెప్పించారు. అలాగే కింగ్ నాగార్జున కృష్ణార్జున సినిమాలో శ్రీకృషుడి పాత్రలో మెప్పించారు. అయితే సినిమా అనుకున్న స్థాయికిలో హిట్ కాలేదు. గోపాల గోపాల సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కృష్ణుడి పాత్రలో కనిపించి మెప్పించారు. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. కృష్ణతత్వాన్ని సరైన విధంగా చెప్పే కథలు హిట్ టాక్ సొంతం చేసుకుంటాయి అని తాజాగా కార్తికేయ2 మూవీ కూడా రుజువు చేసింది. ఇప్పటి వరకు సాంఘిక చిత్రాలలో దేవుడితో ముడిపడి కథలు అంటే ఎక్కువగా శివుడు, అమ్మవారి పాత్రలు మాత్రమే కనిపించేవి. మరి భవిష్యత్తులో అయినా కృష్ణుడి పాత్రలతో సినిమాలు వస్తాయేమో చూడాలి.