Munugode : మాకు టైం వచ్చింది. 3వ తారీఖు వరకూ మా టైం నడుస్తుంది అంటున్నారు మునుగోడులోని మందుబాబులు. ఎవరైనా చీప్ లిక్కర్ పంపిణీ చేసేందుకు యత్నించారో మేమంత చీప్‌గా కనిపిస్తున్నామా? అంటూ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. మొహం మీద వద్దని చెబుతున్నారు. తమది చీప్‌గా చీప్ లిక్కర్ తాగే బ్యాచ్ కాదని.. మంచి బ్రాండ్లకు చెందిన మందు బాటిల్‌తో వస్తే రా.. లేకుంటే పో అని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. కొన్ని ప్రత్యేక బ్రాండ్లు చెప్పి మరీ డిమాండ్ చేసి అడిగి తెప్పించుకుంటున్నారు.
ఏం చేస్తారు.. ప్రస్తుతానికి వాళ్లదే రాజ్యం. కాబట్టి పార్టీలు సైతం వారు ఏ బ్రాండ్ చెబితే ఆ బ్రాండ్ మందును తీసుకెళ్లి వారి చేతిలో పెట్టి దండం పెడుతున్నారు. ఎక్కడ కుదరదంటే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓటేస్తారోనని చచ్చినట్టు నచ్చిన బ్రాండ్ తీసుకొచ్చి ఇస్తున్నారు. అసలే పార్టీలన్నీ మునుగోడు ఉపఎన్నికను సవాలుగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే ఓటరు ఏ గొంతెమ్మ కోరిక కోరినా కూడా కాదనకుండా తీర్చాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే మందుబాబులు తమ జీవితంలో టచ్ చేస్తాం అనుకోని బ్రాండ్లను కోరి మరీ తెప్పించుకుని సీసాలు ఖాళీ చేస్తున్నారు.
ఇక ఈ వ్యవహారమంతా ఇప్పటికిప్పుడు జరుగుతున్నది కాదు.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచే కొనసాగుతోంది. అప్పటి నుంచే పార్టీలు ఓటర్లపై దృష్టి సారించాయి. ఇక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మందు ఏరులై పారుతోంది. మొదట్లో అయితే ఏ మందు ఇస్తే ఆ మందును లేపేశారు. కానీ ఇప్పుడు ఎన్నికకు రోజులు దగ్గరపడుతుండటంతో డిమాండ్ పెరిగింది. ఛీ.. ఛీ చీప్ లిక్కరా? అనేస్తున్నారు. మీరు ఈ చీప్ లిక్కర్‌తో మా స్థాయిని చీప్‌గా అంచనా వేస్తారా? అంటూ సినిమా డైలాగ్స్ చెబుతున్నారు. ప్రస్తుతం వీరి లెవల్.. వేరే లెవల్.