Nara Lokesh: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర 12వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు కొనసాగుతుంది. ఈ సందర్భంగా కొండ రెడ్డి పల్లి లో లోకేష్ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, అభివృద్ధిలో వెనక్కి నెట్టేసారని తీవ్ర విమర్శలు చేశారు. టిడిపికి వస్తున్న ప్రజాదరణను చూసి జగన్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు.

ప్యాలెస్ పిల్లి పరదాలు కట్టుకొని తిరుగుతూ ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకుంటున్నారని ఎద్దేవ చేశారు. తన పాదయాత్రకు అడుగడుగున అడ్డంకి సృష్టిస్తున్నారంటూ విమర్శించారు. రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని అన్నారు. ఎన్నికలు అయిపోయాక నువ్వు ఇంటి నుంచి ఎలా బయటకు వస్తావో చూస్తామని, నీకు భయం ఎలా ఉంటుందో చూపిస్తాను అంటూ లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పుడు మార్గంలో వైసిపి తొత్తులుగా మారిన పోలీసు అధికారులు కూడా మేము అధికారంలోకి రాంగానే ఏం చేయాలో చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఏ ఒక్కరిని వదిలేది లేదని హెచ్చరించారు.
టిడిపికి మద్దతిస్తున్న విద్యార్థుల పైన కూడా హత్యాయత్నం కేసులు పెడుతున్నారని అన్నారు. మోసానికి మరో రూపం జగన్ రెడ్డి అని, కేసుల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారంటూ ఘాటుగా విమర్శించారు. ఈ పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ చిత్తూరు సంజయ్ గాంధీ నగర్ లో అన్న క్యాంటీన్ ని మూసేసి సచివాలయం ఏర్పాటు చేసిన వైనాన్ని పరిశీలించారు. అక్కడ సిబ్బంది అనుమతి తీసుకుని లోపలికి వెళ్ళిన లోకేష్ వారితో మాట్లాడారు. అయితే ఎక్కువ సమయం వారితో చర్చించకుండా వచ్చేసారు. తాను మాట్లాడానని తెలిస్తే వారి ఉద్యోగాలను జగన్ రెడ్డి తీసేస్తాడు అని టిడిపి నాయకులకు చెప్పేసి బయటకు వచ్చేసారు.