New Delhi : అతిగా వేటాడటం, నివాస నష్టం కారణంగా భారతదేశం నుండి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన ఏకైక పెద్ద మాంసాహార జంతువు చిరుత. ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలోని సాల్ అడవులలో 1948లో చివరిగా కనిపించిన పిల్లి జాతి కూడా ఈ మధ్యనే మరణించింది. చిరుతల సంఖ్య దేశంలో తక్కువగా ఉండటంతో ఈ అంశంపై దృష్టి సారించిన భారత ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దక్షిణాఫ్రికాతో ఒప్పందం కుదుర్చుకుని అక్కడి చిరుతలను భారత్ కు తీసుకువచ్చే కార్యక్రమాన్ని చేపడుతోంది.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను తీసుకురానున్నట్లు భారత కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ప్రతిష్టాత్మకమైన చిరుత పునరుద్ధరణ కార్యక్రమం కింద చిరుతలను భారత్ కు తీసుకురానున్నారు. గత సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీ తన 72వ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లోని క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లోకి నమీబియా నుండి ఎనిమిది మచ్చల పిల్లి జాతులను 5 ఆడ , మూడు మగ పిల్లి జాతులను విడుదల చేశారు. ప్రస్తుతం, కునో వద్ద ఉన్న ఎనిమిది చిరుతలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. చిరుతల్లో ఒకదాని క్రియాటినిన్ స్థాయిలు పెరగడంతో ఆమె అస్వస్థతకు గురైంది. చికిత్స అనంతరం ఆమె కోలుకున్నట్లు వారు తెలిపారు.

భారతదేశం మరియు దక్షిణాఫ్రికా జనవరిలో ఆఫ్రికన్ దేశం నుండి చిరుతలను రవాణా చేయడానికి , కునోలో వాటిని తిరిగి ప్రవేశపెట్టడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి . ప్రపంచంలోని 7,000 చిరుతల్లో ఎక్కువ భాగం దక్షిణాఫ్రికా, నమీబియా , బోట్స్వానాలో నివసిస్తున్నాయి. నమీబియా ప్రపంచంలో అత్యధికంగా చిరుతలను కలిగి ఉంది. అందుకే ఈ ఒప్పందానికి పూనుకుంది భారత సర్కార్.

ఫిబ్రవరిలో 12 చిరుతలను దిగుమతి చేసుకున్న తరువాత, తదుపరి 8 నుండి 10 సంవత్సరాల వరకు ఏటా 12 చిరుతలను బదిలీ చేయాలనేది ప్రణాళిక. ఒప్పందం యొక్క నిబంధనల ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి సమీక్షిస్తారు అని పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన ఆక్షన్ ప్లాన్ ఫర్ రీ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియా ప్రకారం, కొత్త చిరుత జనాభాను స్థాపించడానికి అనువైన 12 నుంచి 14 అడవి చిరుతలను దక్షిణాఫ్రికా, నమీబియా , ఇతర ఆఫ్రికా దేశాల నుండి దిగుమతి చేసుకుంటారు.