Pan India Movies: ఇండియన్ సినిమా స్టాండర్డ్ ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ప్రాంతాల వారీగా విడిపోయి సినిమా ఇండస్ట్రీ ఉండేది. అయితే ఇప్పుడు సినిమాకి పాన్ ఇండియా అనే ట్యాగ్ వచ్చి చేరింది. పాన్ ఇండియా కల్చర్ బాహుబలి సినిమాతో జక్కన్న స్టార్ట్ చేశాడు. తరువాత ఇదే ఫార్మాట్ ని కేజీఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీల్ కొనసాగించాడు. తరువాత టాలీవుడ్ లో పెద్ద హీరోలు చేస్తున్న సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా జోనర్ లోనే వస్తున్నాయి. ఇక హిందీ హీరోలు కూడా తమ సినిమాలని పాన్ ఇండియా లెవల్ లో అన్ని ఇండియన్ భాషలలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు ప్రాంతీయ భాష చిత్రాలు ఉంటే ఇప్పుడు ఇండియన్ సినిమా అనే మాట మాత్రమే ఉంది. అన్ని ప్రాంతాలలో యూనివర్సల్ కాన్సెప్ట్ లతో దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నారు.

అలాగే నిర్మాతలు కూడా అన్ని భాషల హీరోలతో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక హీరోలు కూడా భాషలతో సంబంధం లేకుండా మంచి కథ ఎక్కడున్న, దర్శకుడు ఎక్కడి వాడైనా నటించడానికి ఒకే చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్, అభిషేక్ పిక్చర్స్, దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, అలాగే గీతా ఆర్ట్స్ కూడా పాన్ ఇండియా చిత్రాలని అన్ని భాషలలో తీస్తున్నారు. అవసరం అయితే భాగస్వామ్యం ద్వారా సినిమాలు చేస్తున్నారు. సిద్దార్ద్ ఆనంద్ ప్రభాస్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే కబీర్ ఖాన్ బన్నీతో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే హృతిక్ రోషన్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.
అలాగే షారుఖ్ ఖాన్ అత్లీ దర్శకత్వంలో జవాన్ మూవీ చేస్తున్నాడు. ఇక వంశీ పైడిపల్లి తమిళ్ హీరో విజయ్ తో వారసుడు మూవీ చేశాడు. అలాగే వెంకట్ ప్రభు ప్రస్తుతం నాగ చైతన్యతో కస్టడీ సినిమా చేస్తున్నాడు. ఇక వెంకీ అట్లూరి ధనుష్ తో సార్ అనే సినిమా చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల కూడా ధనుష్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఓం రౌత్ ప్రభాస్ తో ఆదిపురుష్ మూవీ చేశాడు. ఇలా భిన్నమైన నేపధ్యాలు ఉన్న దర్శకులు, హీరోల కాంబినేషన్ లో ఇప్పుడు సినిమాలు సిద్ధం అవుతున్నాయి. వీటిలో చాలా వరకు పాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కుతూ ఉండటం విశేషం. అలాగే సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా సౌత్ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
అవసరం అయితే సౌత్ హీరోలతో మల్టీ స్టారర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా అన్ని భాషలలో సినిమాలు చేస్తూ ఉండటం విశేషం. సునీల్ తమిళ్, హిందీ, మలయాళీ సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇలా ఈ కాంబినేషన్ లు అన్ని కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టాండర్డ్స్ లోనే సెట్ అవుతున్నాయి. ఇది నిజంగా చిత్ర పరిశ్రమకి శుభపరిణామం అని చెప్పాలి. ఇలా పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేయడం ద్వారా అన్ని రకాల కథలని చూసే అవకాశం ప్రేక్షకులకి వస్తుంది. అలాగే బాగున్న సినిమాలకి భారీ కలెక్షన్స్ వస్తాయి. ఎవరేజ్ అయిన సినిమా కూడా నష్టాలు లేకుండా బయటపడుతుంది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.