Asst Professor : ఏదైనా ఉద్యోగం చేస్తున్నామంటే.. అది ప్రైవేటైనా కావొచ్చు.. గవర్నమెంట్ అయినా కావొచ్చు.. విధి నిర్వహణలో ఉన్నప్పుడు మాత్రం ఆ సంస్థ పద్ధతులకు అనుగుణంగా మెలుగుతుంటాం. విధులు పూర్తయి ఆఫీసు నుంచి కాలు బయట పెట్టామా? ఇక అదంతా మన పర్సనల్ లైఫ్. మన ఇష్టానుసారంగా బతికేస్తుంటాం. కానీ అదే ఓ మహిళకు చేటు తెచ్చింది. రూ.99 కోట్ల పరిహారం కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. దీనికంతటికీ ఆశ్చర్యకరంగా ఒక ఫోటోనే కారణం. అసలేం జరిగింది? ఇంతకీ ఆ మహిళ ఎవరు?
ఆమె కోల్‌కతాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్. ఆకర్షణీయమైన జీతం.. మంచి సదుపాయాలు. లైఫ్ బిందాజ్. అంతా ప్రశాంతంగా సాగితే మనం ఆమె గురించి మాట్లాడుకోవల్సిన పని లేదు. కోల్‌కతాలోని జేవియర్ విశ్వవిద్యాలయంలో ఒక రోజు ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కళాశాలలో చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థిని తన స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాగ్రాం చూస్తుండగా.. ఒక ఫోటో కనిపించింది. ఆ ఫోటోను ఆమె అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆ విషయాన్ని సదరు విద్యార్థిని తండ్రి గమనించాడు. ఏంటా అని కూతురు దగ్గర నుంచి మొబైల్ తీసుకుని చూస్తే.. షాకింగ్ ఫోటో.
Asst Professor : నాకే పాపం తెలియదు..
కూతురు చదువుతున్న జేవియర్ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పిక్ అది. బికినీలో ఉంది. వెంటనే ఆ తండ్రి విశ్వవిద్యాలయ యాజమాన్యానికి కంప్లైంట్ చేశాడు. దీంతో వీసీ, రిజిస్ట్రార్ సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను విచారించారు. ఆమె చేసిన తప్పిదానికి రాజీనామాకు ఒత్తిడి చేశారు. చివరకు ఆమెతో బలవంతంగా రాజీనామా చేయించడమే కాకుండా.. విశ్వవిద్యాలయ పరువు పోగొట్టినందుకు.. ఆమెకు రూ.99 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. గత ఏడాది అక్టోబరు 7న ఈ ఘటన జరగగా.. ఆలయస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో తెగ వైరల్ అవుతోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ మాత్రం ఆ ఫోటో తను పోస్ట్ చేయలేదని.. తన ఇన్‌స్టా ఖాతా హ్యాక్ అయ్యిందని చెబుతున్నారు. తనకే పాపం తెలియదని.. చేయని నేరానికి నష్ట పరిహారం చెల్లించాలంటున్న యాజమాన్యంపై న్యాయపోరాటం చేస్తానన్నారు.