అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన రజినీకాంత్
ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. జైలర్ మూవీ రిలీజ్‌కు ముందు తలైవా హిమాలయాలుక పయనమయ్యారు. ఇక అక్కడి నుంచి తిరిగి వచ్చి.. ఉత్తరాఖండ్‌లోని పలు పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు. ఇక తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో పర్యటించిన సూపర్ స్టార్.. ఆదివారం రోజున అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. తన భార్య లతతో కలసి అయోధ్య ఆలయానికి వెళ్లిన ఆయన..
అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను చూసి తరించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు అయోధ్యలోనే ఉన్న హనుమాన్ గఢి ఆలయాన్ని సందర్శించిన రజినీ.. ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాను చాలా రోజుల నుంచి ఆయోధ్య రామ మందిరం వద్దకు రావాలని అనుకున్నట్లు రజినీకాంత్ వెల్లడించారు. ఇప్పుడు తన కోరిక నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణం పూర్తి అయిన తరువాత మరోసారి వస్తానని రజినీకాంత్ అన్నారు.