యువ హీరోయిన్లకు బాలీవుడ్ స్టార్ నటి కాజోల్ కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం ‘ది ట్రయల్’ సిరీస్ ప్రమోషన్లలో బిజీబిజీగా పాల్గొంటున్నారు కాజోల్.
గతంలో చాలా ఏళ్ల పాటు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఉన్నారు నటి కాజోల్. దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించారు. ఆమె చేసిన కొన్ని సినిమాలు బాలీవుడ్లో ఆల్‌టైమ్ హిట్లుగా నిలిచాయి. కాగా, ఇటీవల యాక్టింగ్‌లో మళ్లీ బిజీ అయ్యారు కాజోల్. ఆమె నటించిన లస్ట్ స్టోరీస్ 2 ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. కాగా, ‘ది ట్రయల్’ అనే కోర్టు రూమ్ సిరీస్‌లో కాజోల్ ప్రధాన పాత్రలో నటించారు. లాయర్ పాత్రను పోషించారు. డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ‘ది ట్రయల్’ జూలై 14వ తేదీ నుంచి స్ట్రీమ్ కానుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్లలో కాజోల్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో కీలక కామెంట్లు చేశారు.
![ఎవరో చెప్పారని హీరోయిన్లు అలా చేయకండి”: బాలీవుడ్ సీనియర్ స్టార్ కాజోల్ 2 ఎవరో చెప్పారని హీరోయిన్లు అలా చేయకండి”: బాలీవుడ్ సీనియర్ స్టార్ కాజోల్](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2.png)
కాజోల్ :
ఎవరో ఒత్తిడి చేశారనో, కొందరు చెప్పారనో యువ హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీ లాంటివి చేయించుకోకూడదని కాజోల్ అన్నారు. అది పర్సనల్ చాయిస్‌గా ఉండాలని తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మేకప్ విషయంలోనూ ఇదే వర్తిస్తుందని అన్నారు. “దేవుడు మనల్ని నిర్దిష్టమైన విధంగా తయారు చేశాడు. అంతేకానీ మీకు ఎలా కావాలో అలా దేవుడు తయారు చేయలేదు. కావాలంటే మేకప్ ఉంది కదా!” అని కాజోల్ అన్నారు.
ప్లాస్టిక్ సర్జరీ అనేది పర్సనల్ ఆప్షన్‌గా ఉండాలని యాంకర్ చెప్పిన విషయానికి కాజోల్ స్పందించారు. “కచ్చితంగా, నేను కూడా చెప్పేది అదే. అది (సర్జరీ) పర్సనల్ చాయిస్ కావాలి. చేయించుకోవాలని ఓ 25 మంది చెప్పినంత మాత్రాన మీరు చేయించుకోకూడదు” అని కాజోల్ అభిప్రాయపడ్డారు.
ది ట్రయల్ సిరీస్‌లో కాజోల్ ప్రధాన పాత్ర పోషించగా.. జిషు సెంగుప్తా, కుబ్రా సైత్, షీబా చద్దా, అలీ ఖాన్, గౌరవ్ పాండే, విజయ్ విక్రమ్ సింగ్, స్వయం జోషీ కీలక పాత్రల్లో నటించారు. సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించారు. అమెరికన్ సిరీస్ ది గుడ్ వైఫ్ ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది.