Tarak:: ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్ చిత్రాలు ఎక్కువగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత స్టార్ హీరోలు కూడా మంచి కథలు దొరికితే పాన్ ఇండియా స్థాయిలో మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమవుతున్నారు. గాడ్ ఫాదర్ మూవీలో మెగాస్టార్ తో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటించిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ రేంజ్ కి గాడ్ ఫాదర్ లో నటించాల్సిన అవసరం లేదు. కానీ సౌత్ ఇండియన్ మార్కెట్ పై ఫోకస్ పెట్టిన సల్మాన్ గాడ్ ఫాదర్ లో నటించి తన ఇమేజ్ ను సౌత్ లో ఎస్టాబ్లిష్ చేసుకున్నారని చెప్పాలి. ఇక తమిళ్ ఇండస్ట్రీలో కూడా పొన్నియన్ సెల్వన్ మూవీ భారీ మల్టీస్టారర్ చిత్రంగానే ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
అలాగే హిందీలో కూడా స్టార్ హీరోలు కలిసి నటించడానికి సంకోచించడం లేదు. యూనివర్సల్ కథలైతే ఖచ్చితంగా ఇద్దరు హీరోలకు సరైన ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి కథలతో మెప్పించే దర్శకులు వస్తే ఖచ్చితంగా నటించడానికి ఓకే చెబుతున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్ పాన్ ఇండియా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కోలీవుడ్ లో టాలెంటెడ్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న వెట్రి మారన్ రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ కి ఒక కథ చెప్పినట్లు తెలుస్తోంది.
కథ నచ్చడంతో తారక్ కూడా ఈ మూవీకి ఓకే చెప్పినట్లు టాక్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా మరో మెయిన్ లీడ్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. దాని తర్వాత వెట్రి మారన్ దర్శకత్వంలో ధనుష్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.