West Indies: ఒకప్పుడు వెస్టిండీస్ జట్టు పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది విధ్వంసకరమైన బ్యాటర్లు, దుర్బేద్యమైన బౌలింగ్ లైనప్. కానీ ఈ టీంలో ఇప్పుడు నిలకడ లోపించింది. ఆటగాళ్లు ఎవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. స్టార్ బ్యాటర్లు కాసుల కోసం దేశానికి ఆడడం మరిచిపోయారు. ఆయా T20 లీగ్ లలో పాల్గొనడానికి రిటైర్మెంట్లు ప్రకటించారు. దీంతో వెస్టిండీస్ జట్టు చతికిలపడింది. మునుపెన్నడూ లేని విధంగా ఘోరంగా T20 వరల్డ్ కప్ పోరు నుంచి క్వాలిఫయర్ దశలోనే నిష్క్రమించింది.
మొదటగా T20 వరల్డ్ కప్ పోటీలకు నేరుగా అర్హత సాధించడానికి సరైన పాయింట్లు లేకపోవడంతో వెస్టిండీస్ జట్టు క్వాలిఫయర్ పోటీలలో తలపడాల్సి వచ్చింది. క్వాలిఫయర్ పోటీలలో పాల్గొనడం రెండుసార్లు T20 ఛాంపియన్ గా నిలిచిన వెస్టిండీస్ కు ఇదే తొలిసారి. క్వాలిఫయర్ పోటీలలో స్కాట్లాండ్ తో తలపడి ఘోర పరాజయం పాలయ్యింది. దీంతో ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.
తర్వాత వెస్టిండీస్ జట్టు రెండో మ్యాచ్లో జింబాబ్వే తలపడింది. ఈ మ్యాచ్లో గెలిచి సూపర్- 12 పోటీలకు అర్హత సాధించడానికి ఆశలను సజీవంగా ఉంచుకున్నది. ఈ మ్యాచ్లో అల్జారి జోసెఫ్ బౌలింగ్ లో మంచి ప్రదర్శన చేయడంతో జింబాబ్వే జట్టును తక్కువ పరుగులకే నిలువరించింది. దీంతో రెండో మ్యాచ్లో గెలిచి గట్టెక్కింది. వెస్టిండీస్ జట్టు ఉన్న గ్రూపులో అన్ని జట్లకు సమానమైన పాయింట్లు ఉండడంతో నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్లో గెలుపు కీలకమైంది.
West Indies:
ఇక ఐర్లాండ్ తో జరిగిన పోరులో బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో వెస్టిండీస్ 146 పరుగులకే చాప చుట్టేసింది. లక్ష్య చేదనకు బరిలోకి దిగిన ఐర్లాండ్ సునాయాసంగా మ్యాచ్ గెలిచి సూపర్ -12 కు అర్హత సాధించింది. దీంతో టి20 వరల్డ్ కప్ పోరు నుంచి వెస్టిండీస్ నిష్క్రమించాల్సి వచ్చింది. రెండుసార్లు ఛాంపియన్ గా నిలిచిన వెస్టిండీస్ జట్టు ఇలా అర్ధాంతరంగా టోర్నీ నుంచి నిష్క్రమించడంతో వెస్టిండీస్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.