నెల్లూరు రాజకీయాలలో రోజురోజుకు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు, స్థానిక నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. వైసిపి నాయకులు అందరూ కూడా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా వైసిపి ఎమ్మెల్యేలు కలిసి పాల్గొనడం లేదు. ముఖ్యంగా అసమ్మతి నాయకులు ఎక్కువ అయ్యారని చెప్పాలి. ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ అధిష్టానంపై బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరోవైపు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా వైసిపి అధిష్టానంపై చాలాకాలంగా అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తుంది. లిక్కర్ స్కాంలో తన పేరు బయటకు వచ్చినప్పుడు వైసిపి నుంచి ఎలాంటి అండ లభించలేదని అభిప్రాయం మాగుంటలో అసంతృప్తి కారణమనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
అలాగే నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా చాలా కాలంగా రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. పేరుకే ఎంపీ అయినా కూడా ప్రభుత్వ సంబంధిత కార్యక్రమాలలో కూడా ఆయన పాల్గొనడం లేదు. వైసిపి అధిష్టానంపై ఆయన అసంతృప్తితో ఉన్న నేపథ్యంలోనే పెద్దగా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడం లేదని మాట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ ముగ్గురు నాయకులు టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం అయినట్లు నెల్లూరు రాజకీయ సర్కిల్ లో వినిపిస్తున్న మాట. ఇప్పుడు వీరికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే వాళ్లు ఏ సందర్భంలో కలుసుకున్నారు అనే విషయం మాత్రం బయటకు రాలేదు. త్వరలో ఈ ముగ్గురు నాయకులు టిడిపి తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నారని టాక్ ఇప్పుడు రాజకీయాల్లో బలంగా వినిపిస్తుంది. అందులో భాగంగానే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో వీళ్ళు ముగ్గురు సమావేశమైనట్లు బోగట్ట. ఒకవేళ రాజకీయాల్లో సీనియర్ నాయకులుగా ఉన్న మాగుంట, ఆనం, ఆదాల కుటుంబాలు టిడిపిలో చేరితే మాత్రం ప్రకాశం నెల్లూరు జిల్లాలో కచ్చితంగా ఆ ప్రభావం ఉంటుందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. తాజాగా మంగళగిరిలో వైసీపీకి చెందిన కీలక నేత లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. అలాగే చాలామంది వైసిపి నాయకులు టిడిపిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని మాట పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తుంది.