ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితంలో ముఖ్య ఘట్టాల ఆధారంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తీసిన సినిమా వ్యూహం. నిజానికి ఈ సినిమా అనేకసార్లు సెన్సార్ ఇష్యూస్ కారణంతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ…
రాష్ట్రానికి చెందిన వీర శంకర్ రెడ్డి ( రాజశేఖర్ రెడ్డి ) మరణంతో సినిమా మొదలవుతుంది. దాంతో ఆయన కుమారుడు మదన్ ( జగన్) ఒకసారిగా షాక్ కి గురవుతాడు. తండ్రి మరణంతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారని తెలిసి వారిని ఓదార్చటానికి ఓదార్పు యాత్ర చేయాలనుకుంటే భారత్ పార్టీ హై కమాండ్ ఒప్పుకోదు. దీనికి తోడు ప్రతిపక్ష నేత ఇంద్ర బాబు ( చంద్రబాబు) భారత్ పార్టీతో కలిసి అక్రమాస్తుల కేసులు పెడతారు. దీంతో ఆ పార్టీని ఎదిరించి కొత్త పార్టీని పెట్టుకుంటాడు మదన్. మదన్ అక్రమస్తులకు కేసులో జైలుకు వెళ్లి వచ్చాక జరిగిన ఎన్నికలలో శ్రవణ్ కళ్యాణ్ ( పవన్ కళ్యాణ్) మద్దతుతో ఇంద్రబాబు గెలుస్తాడు. ఆ తర్వాత ఇంద్రబాబుకి శ్రవణ్ కి మధ్య ఎందుకు దూరం పెరిగింది? మదన్ ప్రజలకు ఎలా దగ్గరయ్యాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటులు
మదన్మోహన్ రెడ్డి అనే పాత్రలో నటించిన అజ్మల్ అమీర్ తన పాత్రకి పూర్తిగా న్యాయం చేశాడు. బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి మాటల వరకు కరెక్ట్ గా సెట్ అయ్యేలా నటించాడు. ఆయన భార్య మాలతి పాత్రలో నటించిన మానస కూడా మంచి నటన ప్రదర్శించింది. ఇక ఇంద్రబాబు పాత్రలో నటించిన ధనుంజయ్ కూడా లుక్స్ విషయంలోనూ, నటన విషయంలోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక మిగతా పాత్రలు దారులు అందరూ తమ తమ పరిధి మేరకు బాగానే నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టు సరిపోయింది. నిడివి కూడా రెండు గంటల ఒక నిమిషం కావటం కాస్త కలిసివచ్చే అంశం.రావాలి జగన్ కావాలి జగన్ రీమిక్స్ వంటి సాంగ్స్ వినడానికి బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆసక్తికరంగా అనిపించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునే లాగా ఉంది.
విశ్లేషణ
ఈ సినిమా వైయస్ జగన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల సమాహారం అని రాంగోపాల్ వర్మ ప్రకటించారు. కొన్నిసార్లు సెన్సార్ తో ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఈ సినిమాలోని పాత్రలకు నిజ జీవితంలో ఎవరికీ పోలికలు లేవని ఒకవేళ ఏమైనా పోలికలు ఉంటే అవి యాదృచ్ఛికమే అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు వరకు ఈ సినిమా సాగుతుంది.
రేటింగ్: 3/5