ఇంతకుముందు డాక్టర్ బాబు, వంటలక్క, మోనితది కథ అయితే.. ప్రస్తుతం వారి వారసులు హిమ, సౌర్య, నిరుపమ్‌ది కథ. హిమకి నిరుపమ్‌కి పెళ్లి చేయాలని అనుకుంటుంది సౌర్య. అది చూసి ఆనందరావు ఆందోళన చెందుతాడు. సౌందర్య అతనికి ధైర్యాన్ని ఇస్తుంది. హిమకి, నిరుపమ్‌కి పెళ్లి చేద్దాం. ఆ తర్వాత అన్ని సర్దుకుంటాయని చెబుతుంది. ఆ మాటలు విన్న నిరుపమ్ సంతోషపడతాడు. అప్పుడే అక్కడికి నిరుపమ్ తల్లి స్వప్న, శోభ ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత ఆగస్టు 8న ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.
‘మీ అమ్మమ్మ, తాతయ్య నువ్వు అనుకున్నంత గొప్పవాళ్ల కాదురా’ అని నిరుపమ్‌కి హితబోధ చేస్తుంది స్వప్న. అనంతరం డాక్టర్ నిరుపమ్‌కి, డాక్టర్ శోభకి పెళ్లి మమ్మీ అంటూ ఓ శుభలేఖని సౌందర్య చేతిలో పెడుతుంది స్వప్న. నా తల్లిదండ్రులుగా మీకు గౌరవం ఇవ్వడం కోసం మొదటి శుభలేఖ మీకే ఇచ్చాను అని చెబుతుంది స్వప్న. ఏంటే కథ మళ్లీ మొదటికి వచ్చిందంటూ ఆ శుభలేఖని చించిపడేస్తుంది సౌందర్య. అయినప్పటికీ స్వప్న, శోభ అదేం పట్టించుకోరు. స్వప్న అయితే ఏంటి ఈ ఇంట్లో పెళ్లికళ లేదంటూ వెటకారంగా మాట్లాడుతుంది. దాంతో సౌందర్య కోపంగా.. ‘నా మనవడు నిరుపమ్‌కి నా మనవరాలు హిమకి నిర్ణయించిన ముహూర్తంలోనే పెళ్లి జరుగుతుంది. ఇది తథ్యం.. ఎవరు వచ్చినా ఈ పెళ్లి జరుగుతుంది.. దీన్ని ఎవ్వరూ ఆపలేరు’ అంటూ స్వప్నకి చెబుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సౌర్య కోపంగా.. అక్కడ నుంచి మళ్లీ వెళ్లిపోతుంటే గమనించిన సౌందర్య.. ‘సౌర్యా ఆగు.. ఇలారా’ అంటుంది. సౌర్య రాకపోవడంతో వెళ్లి సౌర్య చేయి పట్టుకుని వాళ్ల దగ్గరకు తీసుకొస్తుంది సౌందర్య.
‘రేయ్ ఆరోజు సౌర్య ఏమందో గుర్తుందా. హిమ మెడలో తాళి కట్టమంది కదా. హిమా, నిరుపమ్ పెళ్లి నువ్వే చేస్తా అన్నావ్ కదా సౌర్యా? అన్నావా లేదా? ఈ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నట్లు చెప్పు. అదే మాట నీ పొగరుబోతు అత్తతో చెప్పు’ అంటూ అరుస్తుంది సౌందర్య. అయినప్పటికీ సౌర్య ఏం మాట్లాడదు. అది విన్న స్వప్న నవ్వుతూ.. ‘హలో మమ్మీ.. అబద్దాలు చెప్పడం ఆపుతావా? జరగనివి అన్నీ ఊహించుకుని ఆనందపడకండి.. మీరు అనుకున్నది ఏది జరగదు. జరిగేదేంటో నేను చేసి చూపిస్తాను.. నిరుపమ్ పదరా’ అంటూ చేయి పట్టుకుని నిరుపమ్‌ని తీసుకెళ్లిపోతుంది. నిరుపమ్ రానంటూ చేయి వదిలించుకునే ప్రయత్నం చేసినా స్వప్న వదిలిపెట్టదు.
ఆ తర్వాత సౌందర్య.. కార్తీక్, దీప ఫొటోల వద్దకు వెళుతుంది. ‘ఎప్పుడు జ్వరం అనే హిమ డాక్టర్ అయ్యింది. త్వరలో పెళ్లికూతురు కాబోతోంది. మీరు ఉంటే బావుండేది. మీతో పాటే ఈ ఇంటి నుంచి సంతోషాలు అన్ని పోయాయి. ఇప్పుడే మళ్లీ ఈ ఇల్లు కళకళలాడుతోంది’ అని సంతోషపడుతుంది సౌందర్య. అది చూసిన హిమ వారి ఫొటోల దగ్గరకి వచ్చి ‘ఏలాగైనా సౌర్యకి నిరుపమ్‌కి పెళ్లి చేయాలి. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి’ అని మనసులో అనుకుని.. ఏదో నిర్ణయించుకుని వేగంగా ఎక్కడికో వెళ్లిపోతుంది హిమ. నాన్నమ్మ పిలిచి పలకదు.
ఇక స్వప్న సత్యానికి ఏదో ప్లాన్ చెప్పి.. ‘నేను చెప్పింది అర్ధమయ్యిందా. ఈ రెండు రోజులు మీరు ఏం మాట్లాడొద్దు. నేను చెప్పిందే మీరు చెయ్యాలి. తినడానికి, అవలింతకి మాత్రమే నోరు తెరవాలి. అవసరమైనప్పుడు ఊ.. ఆ.. అని మాత్రమే అనాలి.. ఎదురు ప్రశ్న వేయొద్దు.. మన ఐడియా మాత్రం ఎవ్వరికీ చెప్పొద్దు.. నన్ను కాదు అని ఆ ఇంటికి వెళ్లొద్దు.. మీరు నా మాట వినాల్సిందే’ అంటూ సత్యతో తన మీద ఒట్టు పెట్టించుకుంటుంది. ‘స్వప్నా దీనికి ఒట్టు పెట్టడం దేనికి.. నువ్వు చెప్పినట్లే వింటాను అన్నాను కదా’ అంటాడు సత్యం బాధగా.
మరోవైపు గదిలో సౌర్య బాధగా ఉంటుంది.. అప్పడే అక్కడికి వచ్చిన సౌందర్యని కోపంగా చూస్తుంది. అలా చూడకు నాకు నీకంటే కోపం ఎక్కువే అని అంటుంది సౌందర్య. అది విని సౌర్య ఏదో పెద్ద ప్లాన్‌తోనే వచ్చినట్లు ఉన్నావు కదా చెప్పు అంటుంది. ఓ అబ్బాయి ఫొటో సౌర్య చేతిలో పెట్టి.. అబ్బాయి ఎలా ఉన్నాడు అంటుంది. ఇంతలో ఆనందరావు కూడా లోపలికి వస్తాడు. ‘బాగున్నాడు. ఏం నడుపుతాడు. ఆటోనా. లారీనా అని వెటకారంగా మాట్లాడుతుంది సౌర్య. అలా అంటావేంటి.. ఇతను నిరుపమ్లాగే డాక్టర్. అతని నాన్న బిజినెస్ మాగ్నెట్ అని చెబుతుంది సౌందర్య. అయితే ఈ అబ్బాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి తాతయ్య, నాకు ఈ పెళ్లి వద్ద అంటుంది సౌర్య. ‘నీ పెళ్లి కోసమే ఈ అబ్బాయి ఫొటో తెచ్చానే.. చేసుకోవా? రేపు హిమ పెళ్లిలో మీ రెండో మనవరాలి పెళ్లి ఎప్పుడు అంటే ఏం చెప్పాలే’ అని అంటుంది సౌందర్య కొంచెం బాధపడుతూ. ‘నా పెద్ద కొడుకు(కార్తీక్) పెద్ద కోడలు(దీప) వచ్చినప్పుడు అని చెప్పండి’ అని ఫొటో సౌందర్య చేతిలో పెట్టేసి వెళ్లిపోతుంది సౌర్య కోపంగా.
మరోవైపు హిమ, ప్రేమ్.. రవ్వ ఇడ్లీ వాళ్ల ఇడ్లీ బండీ దగ్గర కలుస్తారు. అప్పుడు హిమ చాలా డల్‌గా ఉంటుంది. ‘హిమా ఈ రవ్వ ఇడ్లీ అంటే నీకు ఎందుకంత ఇష్టం అంటాడు ప్రేమ్. ‘కొన్ని అంతే బావా అలా కుదురుతాయి.. కారణాలేం ఉండవు’ అని మాట మారుస్తుంది హిమ. మనసులో మాత్రం.. ‘వాడు మా తమ్ముడే అని.. మోనిత ఆంటీ కొడుకని నీకు ఎలా చెప్పగలను బావా’ అనుకుంటుంది హిమ. ఇక ప్రేమ్ ‘హిమా ఈ పెళ్లి ఎందుకు ఆపమంటున్నావ్? సౌర్య ఇష్టపడుతుందనేనా? లేక త్యాగం చేస్తున్నావా?’ అని ప్రశ్నిస్తాడు. అది విని.. త్యాగం అని చెబితే ప్రేమ్ ఫీల్ అయ్యి పెళ్లి ఆపడానికి సహాయం చేయకపోవచ్చు అనుకుని.. ‘త్యాగాలు అవి ఏం లేవు. నిరుపమ్‌తో పెళ్లి ఇష్టం లేదు’ అని చెబుతుంది. అది విని హిమతో తన ప్రేమ సక్సెస్ అవుతుందని ఆనందపడతాడు ప్రేమ్. ఇదంతా కొంతదూరంలో కారులో కూర్చుని శోభ గమనిస్తూనే ఉంటుంది. ‘ఈ హిమ చెసేది త్యాగం అని ప్రేమ్‌కి తెలియకపోవచ్చు కానీ.. లోకానికి తెలుసు. ఈ స్వప్న ఆంటీ చెప్పినట్లు ఈ పెళ్లి ఆగేలా కనిపించడం లేదు. తనే ఏదో ఒకటి చేయాలి’ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది శోభా.
మరోవైపు నిరుపమ్.. సౌర్యని కలుస్తాడు. ‘నేను మొదటి నుంచి హిమనే ప్రేమించాను.. నన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావ్.. కానీ నాకు ఇప్పుడు నీ నుంచి ఓ సాయం కావాలి. మా మమ్మీ, శోభ నుంచి నువ్వు నన్ను కాపాడి.. నా పెళ్లి హిమతో నువ్వే చెయ్యాలి’ అని సూటిగా అడుగుతాడు నిరుపమ్. ‘తప్పుకుండా డాక్టర్ సాబ్.. ఇక్కడితో ఈ డ్రామాలకు తెరపడితే బాగుంటుంది. అందుకే మీరు అడిగింది నేను చేస్తాను.. నువ్వు వెళ్లు డాక్టర్ సాబ్.. నీ పెళ్లి జరుగుతుంది.. ఆ శోభ సంగతి, మీ మమ్మీ సంగతి నేను చూసుకుంటాను’ అని ధైర్యం ఇస్తుంది సౌర్య. ‘నువ్వు గ్రేట్ సౌర్యా.. నేను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయమని.. నన్ను ప్రేమించిన అమ్మాయిని అడగటమే పెద్ద సాహసం.. అందులోనూ నువ్వు ఒప్పుకోవడం ఇంకా గొప్ప సౌర్యా’ అని ఎంతో సంతోషంగా అంటాడు నిరుపమ్. ‘ఈ పెళ్లి జరుగుతుంది డాక్టర్ సాబ్’ అంటుంది సౌర్య. కానీ మనసులో మాత్రం కుమిలిపోతూనే ఉంటుంది నిరుపమ్‌కి హిమతో పెళ్లిని తలచుకుంటూ. ఈ పెళ్లి ఆపడానికి స్వప్న, శోభా ఏం చేస్తారు.. వారికి సౌర్య చెక్ పెడుతుందా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.